5, మే 2011, గురువారం

లౌక్యానికి మోసానికి తేడా

మొన్నెవరో ఓ బ్లాగుమిత్రుడు లౌక్యానికి మోసానికి తేడా గురించి అడిగారు.

చందమామలో ఒక బేతాళ కథ గుర్తొచ్చింది.

ప్రారంభం సరిగా గుర్తులేదు.

"వరహాలు అనే వ్యక్తి ఒక వడ్డీవ్యాపారికి బాకీ పడ్డాడు.

ఒకసారి ఆ వడ్డీవ్యాపారి బాకీ వసూలుకు వస్తే,

దివాణంలో పనిచేస్తున్న తన బంధువు వాసుదేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నానని,

అతని దగ్గర డబ్బు తెచ్చి, బాకీ తీరుస్తానని వరహాలు అంటాడు.

అప్పుడు వడ్డీవ్యాపారి " ఆ ! వాసుదేవుడు నీకు బంధువా ? చెప్పావు కావేం ?

బాకీ సంగతి తర్వాత చూసుకోవచ్చు. మీ బంధువుకు చెప్పి ,

నా బావమరిదికి దివాణంలో ఉద్యోగం వేయించు. చాలు". అన్నాడు.

అయితే వరహాలు బంధువు వాసుదేవుడిది చిన్న ఉద్యోగం.

అతనికి ఉద్యోగాలు ఇప్పించే తాహతు లేదు.

అదేపేరుతో ఉన్నతాధికారి ఒకడు దివాణంలో ఉన్నాడు.

వడ్డీవ్యాపారి , ఆ ఉన్నతాధికారే వరహాలు బంధువనుకొన్నాడు.

వడ్డీవ్యాపారి పొరబడ్డాడని తెలియగానే వరహాలు బుర్రలో - ఆ పొరపాటును నిజం చేస్తే,

తన బాకీ రద్దు కావటమే కాక, ఊళ్లో తన పరపతి పెరుగుతుందనే ఆలోచన మెరిసింది.

"సరే రేపు కనిపించండి." అని వడ్డీవ్యాపారిని పంపేసి,

ఆ రోజే దివాణానికి వెళ్లి, తన బంధువైన వాసుదేవుణ్ణి కలుసుకొని,

దివాణంలో పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగులందరి పేర్లూ, వారి హోదాలు,

వారి జీవిత వివరాలు అన్నీ వ్రాసుకొన్నాడు.

తర్వాత ఉన్నతాధికారి వాసుదేవుడి కచేరీకి వెళ్లి, అక్కడి వాళ్లతో " నన్ను మండలాధికారి

వీరవర్మగారు పంపించారు. వారి బంధువుకు ఏదో ఉద్యోగం వేయించాలట.

నేను వాసుదేవుడుగార్ని కలుసుకోవాలి." అన్నాడు.

వాసుదేవుడి దర్శనం వెంటనే దొరికింది. ఆయన " అలాగే . ఉద్యోగం కావలసిన కుర్రవాణ్ణి,

నా వద్దకు రేపు పంపమను." అన్నాడు.

వడ్డీవ్యాపారి బావమరిదికి మర్నాడే దివాణంలో ఉద్యోగం దొరికింది.

వరహాలు నిమిషాలమీద దివాణంలో ఉద్యోగం ఇప్పించగలిగాడన్న మాట

ఊరంతా పొక్కిపోయింది. అతడికి దివాణంలో గొప్ప గొప్ప అధికారులవద్ద

పలుకుబడి ఉందని పుకారు పుట్టింది. అందరూ అతని స్నేహం కోసం ఎగబడ్డారు.

దివాణంలో ఉద్యోగాలు, పనులు కావలసినవాళ్లు కానుకలు ఇవ్వడంలో పోటీపడ్డారు.

కనకవర్షం మొదలయింది.

వరహాలుకు లౌక్యం తోడ్పడింది.

సేనాపతి , కోశాధికారి ఇలాంటి అత్యున్నతోద్యోగులందరికీ ఇతరుల మిత్రునిగా

పరిచయమై, క్రమంగా వారికే స్వయానా మిత్రుడయ్యాడు.

అందరి పనులూ చక్కపెట్టి, క్రమంగా లక్షలు ఆర్జించాడు.

రాజధానిలోనే వర్తకం ప్రారంభించి, వరహాలశ్రేష్టి అయ్యాడు.

రాజుగారి శుభకార్యాలలో వెలలేని రత్నాలు ఇచ్చి, "చిన్నకానుక" అనేవాడు.

ఇప్పుడు అతడు కాకిచేత కబురు చేయిస్తే దివాణంలో పని అవుతుంది.

ఒకసారి రాజు తన పుట్టినరోజుకి ఉన్నతాధికారులకు, కొద్దిమంది అత్యంత ధనవంతులకు

ప్రత్యేకమైన విందు ఇచ్చి, ఎవరెవరు ఎలా పైకి వచ్చింది చెప్పమన్నాడు.

అందరూ కొంత నిజం దాచారు కానీ వరహాలు ఉన్నదున్నట్లు చెప్పేశాడు.

అందరూ హర్షించి చప్పట్లు కొట్టారు.

వరహాలు లౌక్యాన్ని రాజు ప్రశంసించాడు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వరహాలది లౌక్యమా ? మోసమా ?

జవాబు :-

కొందరు ఉన్నతస్థాయిలో పుడతారు.

ఉదా: రాజు కొడుకు ప్రయత్నం లేకుండానే రాజు అవుతాడు.

కొందరు ఉన్నతస్థాయిని చేరుకొంటారు. వీరికే లౌక్యం అవసరం.

ఒకసారి ఉన్నతవర్గంలోకి చేరాక లౌక్యం అవసరం లేదు.

కాని డబ్బులేని దశనుంచి రాజధానిలో ఉన్నత వర్తకుని దశకు ఎదిగిన

వరహాలు లౌక్యం మాత్రం నిస్సందేహంగా అసాధారణమైనది.

ఒకసారి ఉన్నతి లభించాక అది ఎలా లభించిందని ఎవరూ పరీక్షించరు.

అలా పరీక్షిస్తే లౌక్యంతో పైకి వచ్చినవారందరూ దండనార్హులే అవుతారు.

ఫలించని లౌక్యం మాత్రమే శిక్షకు గురి అవుతుంది.

చిన్నప్పటినుండి నాకెంతో ఇష్టమైన
"చందమామ " సౌజన్యంతో.

1 కామెంట్‌:

Maanas చెప్పారు...

chala baga rasaru! malli chandamama chadivinattu anipinchindi...