14, మే 2011, శనివారం

రిలాక్స్ అవ్వాలంటే ఇలా రండి

గోవిందుని భజించండి.

ప్రార్థన




సంగీతవిద్వన్మణి సుబ్బులక్ష్మిగారి గొంతు అనే తేనెపట్టునుండి తేనెలా జాలువారే

భజగోవిందం వింటూంటే మొన్న ఒకసారి భజగోవిందం గురించి, తెలుసుకోవాలనిపించి,

వివరాలు సేకరించడం జరిగింది. అవి మీతో పంచుకోవాలనిపించింది.

ఈ భజగోవింద స్తోత్రాన్ని శంకరాచార్యులువారు రచించారని లోకవిదితమే కదా!

ఆయన, పద్మపాదుడు మొదలైన శిష్యులతో కలసి, కాశీలో కొంతకాలం గడిపారు.

ఆ కాశీలో, వ్యాకరణశాస్త్రం చదివిన ఒక బ్రాహ్మణుడు, రాత్రీ పగలూ ఆ సూత్రాలను

వల్లెవేస్తూండడాన్ని కొన్ని రోజులపాటు గమనించి చూశారు.

ఒకనాడు, అరుణోదయకాలంలో ఆచార్యులవారు శిష్యులతో కలసి,

గంగాస్నానానికి వెళ్తూండగా, ఆ పండితుడు, " డుకృఞ్ కరణే "

అనే ఒక వ్యాకరణసూత్రాన్ని వల్లె వేస్తున్నాడు.

ఆచార్యులవారు, ఆ పండితుని, ( తద్ద్వారా లోకుల్ని), తరింపజేయాలనే ఉద్దేశ్యంతో,

ఆయన వద్దకు వెళ్లి, ఈ భజగోవిందస్తోత్రాన్ని చెప్పారు.

శంకరుడు చెప్పినవి మొత్తం 12 శ్లోకాలు.

దీనికి " గోవిందద్వాదశమంజరికాస్తోత్రం " అని పేరు.

ఈ శ్లోకాలు చెవుల పడగానే ఆ పండితుడు, శ్రద్ధాళువయ్యాడు.

అప్పుడు, శంకరుని శిష్యులు పద్నాలుగుమంది పద్నాలుగు శ్లోకాలు చెప్పారు.

దీనికి " చతుర్దశమంజరికాస్తోత్రం " అని పేరు.

అప్పటికి ఆ పండితుడు, తెలివి తెచ్చుకొని, శంకరునికి సాష్టాంగం చేశాడు.

అనంతరకాలం గోవిందుని భజించి, కృతార్థుడయ్యాడు.

ఈ శ్లోకాలు ఉపనిషత్సారభూతాలు.

సంస్కృతభాషలో రచింపబడ్డ వీటికి తెలుగుఅనువాదం ఇదిగో చిత్తగించండి.

ఎంతోమందికి ఉపయుక్తం కాగలదు అనే ఆశతో.....


నాగస్వరం.



భజగోవిందం భజగోవిందం భజగోవిందం మూఢమతే,

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణే.

" ఓ మందబుద్ధీ! గోవిందుని భజించు.

( మరణ ) కాలం సన్నిహితమై, సంప్రాప్తించినపుడు,

డుకృఞ్ కరణే ( అనే సూత్రం ) నిన్ను రక్షించదు రక్షించదు.


వినండి

భజగోవిందం -1




నా(గ)స్వ(రం)వ్యాఖ్య:-


" నిత్యం సన్నిహితో మృత్యుః " - మృత్యువు నిత్యం సన్నిహితంగా ఉంటుంది. అందువల్ల

" కలౌ స్మరణాన్ముక్తిః " - ఈ కలుషనిలయ కలియుగంలో భగవన్నామస్మరణే రక్షణ.

" నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే."

సంసారాన్ని తరించటానికి నామస్మరణను మించిన ఉపాయాన్ని చూడలేం.

అందువల్ల రామ కృష్ణ నృహరి అని భగవంతుని నామాన్ని సదా పలుకాలి.

" ఇహపరసాధన మిది యొకటే
సహజపు మురారి సంకీర్తనొకటే " అని,

" ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయె " అని

ఇలా ఎన్నో రకాలుగా వేంకటేశుని కీర్తించిన అన్నమయ్య ఈ కీర్తనలను

వినండి.

ఇహపరసాధన




ఇన్నిట ఇంతట




ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

Seek Govinda, Seek Govinda,
Seek Govinda, O Fool!
When the appointed times comes (death),
grammar rules surely will not save you.



శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: