16, మే 2011, సోమవారం

నారీ స్తన భర నాభీ దేశం

నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం,

ఏత న్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారం. 2




" ఆడుదాని వక్షస్థలాన్ని, బొడ్డు ( ఉన్న ప్రదేశము ) ను, చూసి, మోహావేశాన్ని పొందకు.

దీనిని, మాంసం, క్రొవ్వు మొదలైనవాటి వికారంగా మనసులో మాటిమాటికి చింతించు.

( భావించు )".



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-




ఈ శ్లోకం, స్త్రీపురుషుల కామానికి సంబంధించినది.

( అసలు, కామం అంటే కోరిక. ఒక లడ్డు తినాలనుకోవడం కూడా కామమే.)

ఇందులో, స్త్రీలను చూసి, కామమోహావేశం తెచ్చుకోవద్దని చెప్పబడింది.

అదేమిటండి ? స్త్రీలకు కామం ఉండదా?

పైగా స్త్రీలకు కామం అధికం అన్నారుగా! అంటారా?

అన్నది నిజమే, కానీ ఈ విషయం అర్థం చేసుకోవడంలో లోపం. అంతే.

అసలు విషయం ఏమిటంటే,

మగవాడు, త్వరగా ఆవేశపడి, అంతే త్వరగా చల్లారిపోతాడు.

స్త్రీ అలా కాదు. నెమ్మదిగా తారాస్థాయికి వెళ్ళి, మళ్లీ నెమ్మదిగా నెమ్మదిస్తుంది.

అంత సేపు ఆవిడ అలా ఎంజాయ్ చేయడాన్ని చూసి,

కుళ్లుకొన్న ఏ మగాడో వ్రాసిన వ్రాత అది. అతి కామం అంటే వాడి దృష్టిలో అది.

అసలు నిజానికి అతికామం అన్నది ఒక రోగం.

వైద్య పరిభాషలో దానికి Nymphomania అని పేరు. అందువల్ల

.....,... చూడగానే ఆవేశపడేది మగవాడే.

అందువల్ల అతడికే వైరాగ్యసాధన చెప్పబడింది.

( నిజానికి ఆడువారి క్షేమం కోసమే మగాళ్లకు వైరాగ్యసాధన చెప్పబడిందేమో! )

.....,... చూస్తూ ఆవేశపడితే,

( నిజానికి ఈస్ట్రొజెన్ హార్మోన్ వల్ల వచ్చిన నునుపే ఆ ఆకర్షణకు కారణం.

దాని ప్రభావం తగ్గగానే, ఆడదానిమీద మగాడి ఆ వెంపర్లాటా తగ్గిపోతుంది.)

అప్పుడు " ఛీ, వాటిలో ఏముంది? మాంసం, క్రొవ్వు, నెత్తురు, తప్ప. అని

చూసినప్పుడల్లా పదే పదే మాటి మాటికి మనసులో భావిస్తూండాలి.

ఇదే అభ్యాసం - practice.

అప్పుడు విరక్తి కలుగుతుంది. ఇది వైరాగ్యం.

కామార్తులకు ఎవరికైనా వైరాగ్యం అవసరమే. స్త్రీపురుషభేదం లేదు.

రక్తప్రవాహపువేడి తగ్గగానే పుట్టేది వైరాగ్యమే.

అయితే అప్పుడు కాదు. ముందే సాధించాలి.


కామానికి పూర్తిగా కారణభూతమైనది మనసు. దీన్ని అరికట్టాలి.

అయితే చెప్పుకొన్నంత తేలిక కాదు మనసును లొంగదీయడం.

అందుకే అర్జునుడు, మనందరి తరఫున భగవానునితో,


" చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం,

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం".



" ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. బాగా మథించే స్వభావం కలది. దృఢమైనది.

మిక్కిలి బలీయమైనది. కనుక దాన్ని నిగ్రహించడం గాలిని ఆపడంలా చాల దుష్కరంగా

భావిస్తున్నాను " . అని అంటే,



జగద్గురువైన కృష్ణుడు,



" అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం,

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే."





" ఓ మహాబాహూ! నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే.

దాన్ని వశపరచుకోవడం మహా కష్టం. కాని, అర్జునా!

1. అభ్యాసం 2. వైరాగ్యం అనే రెండింటిద్వారా దాన్ని వశం చేసుకోవడం

సాధ్యమే." అని చెప్పడం జరిగింది.



అభ్యాసం అంటే practice.

రాగం ( అంటే రక్తి, అనురాగం ) లేకపోవడమే విరాగం. దాని భావమే వైరాగ్యం.


పోతన, ప్రహ్లాదుని గుణాలు చెప్తూ,

" కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన సేసి, మరలువాడు " అని వర్ణిస్తాడు.

తన భార్య కాక ఇతరులు అన్యకాంతలు.

వారి పట్ల మాతృభావన అనేది గొప్ప భావన. ఇది కేవలం భారతీయ సంస్కృతి.

దీన్ని సాధించిన వాడు నిజమైన మగవాడు.

ఆడువారి పాలిటి నిజమైన రక్షకుడు.


భక్తతుకారాం బోధ వినండి.



ఇపుడు చక్రధారి వైరాగ్యం వినండి.



ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

Seeing the full bosom of young maidens and their navel,
do not fall a prey to maddening delusion.
This is but a modification of flesh and fat.
Think well thus in your mind again and again.



శుభం భూయాత్

5 కామెంట్‌లు:

రాజేష్ జి చెప్పారు...

$నాగస్వరం గారు

అధ్బుతమండి. మీ స్వవ్యాఖ్యతో చాలా బాగా వివరిస్తున్నారు శ్రీ ఆదిశంకరచార్య భగవత్పాదుల భాజగోవింద౦ గురించి. దానికి తగ్గట్లు పాటలు కూడా పెట్టారు. మంచివి ఇలా పంచుతున్న౦దుకు ధన్యవాదాలు.

స్వగత౦: నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళలో నా స్నేహితుడి ఊరు వెళితే అక్కడ అతని(మా) వదినగారు ఈ పుస్తకం ఇచ్చారు. నేను వాటిని అప్పట్లో కంఠతా పట్టేవాడిని. చాలా బాగా ఆకర్షి౦చాయి. ఇది చూసి మా నాన్నగారికి దిగులు.. వీడేమి అయిపోతాడో అని మా అమ్మగారితో అనడ౦ నాకింకా గుర్తు :)

రాజేష్ జి చెప్పారు...

అయ్యో.. పేరు తప్పురాసాను..చూసుకోవాల్సింది. క్షమించి "భజగోవింద౦" అని చదువుకోగలరు.

నాగస్వరం చెప్పారు...

చాల సంతోషం రాజేశ్.జి గారు!

భజగోవిందం చదువుతున్నందుకు,

మనసారా మెచ్చుకొన్నందుకు,

మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ మెయిల్ చిరునామా ఇచ్చి ఉంటే

మీకే Direct గా కృతజ్ఞతలు తెలియచేసిఉండేవాడిని.

సంతోషం.

and again thanks.

నాగస్వరం.

చంటి చెప్పారు...

Excellent Sir...Parasa jagannadha rao.Kovvur. WGDt AP.

నాగస్వరం చెప్పారు...

సంతోషం. చంటిగారూ!

చదివినందుకు, అభిప్రాయం తెలియజేసినందుకు

ధన్యవాదాలు.