రామాయణం చదవకుండా సరి కాని సంగతులను విన్నవారు సందేహపడిన విషయమిది.
స్త్రీని ఇష్టం లేకుండా తాకితే రావణుని తల వక్కలవుతుందని వేదవతి శాపమిచ్చింది కదా! మఱి సీతను అపహరించేటప్పుడు ఆమెను తాకిన రావణునికి ఏమీ కాలేదెందుకు?.
ఇదీ సందేహం.
వేదవతి శాపం శుద్ధ అబద్ధం.
నా(గ)స్వ(ర)వ్యాఖ్య
ఒకసారి రావణుడు హిమవత్పర్వత ప్రాంతారణ్యానికి వెళ్ళి అక్కడ సంచరిస్తూ, కుశధ్వజుని కుమార్తె వేదవతిని చూశాడు.
ఆమె ఒద్దంటూన్నా వినకుండా భార్యవు కమ్మంటూ ఆమె శిరోజాలను పట్టుకొన్నాడు.
అవమానభారంతో వేదవతి కోపించి, అగ్నిప్రవేశం చేస్తూ, రావణునితో
"శాపే త్వయి మయోత్సృష్టే
తపసశ్చ వ్యయో భవేత్."
"నీకు శాపమిస్తే నా తపస్సు వ్యయమై పోతుంది." అంది.
కాబట్టి ఏ శాపం ఇవ్వలేదని అర్థమైంది కదా!
ఇంతకీ రావణుని తల వ్రక్కలయ్యే శాపం ఇచ్చినది కుబేరుని కొడుకైన నలకూబరుడు.
ఆ కథ ఏమిటంటే, ఇంకోసారి రావణుడు నలకూబరుని భార్య రంభను ఆమె అధర్మమిది వలదంటున్నా వినిపించుకోకుండా మానభంగం చేస్తాడు. అది తెలిసిన నలకూబరుడు
"యదా హ్యకామాం కామార్తో
ధర్షయిష్యతి యోషితమ్,
మూర్దా తు సప్తధా తస్య
శకలీభవితా తదా."
"ఈ రావణుడు కామం లేని స్త్రీని ఎవ్వరినైన అనుభవిస్తే, అప్పుడు ఈతని శిరస్సు ఏడు ముక్కలుగా బ్రద్దలవుతుంది." అని శపిస్తాడు.
అలాగే పుంజికస్థల అనే అప్సరసనూ రావణుడు చెఱుస్తాడు. ఆవిడ బ్రహ్మతో మొఱ పెట్టుకొంది.
బ్రహ్మ కోపించి,
"అద్యప్రభృతి యామన్యాం
బలాన్నారీం గమిష్యసి,
తదా తే శతధా మూర్ధా
ఫలిష్యతి న సంశయః"
"ఈనాడు మొదలు పరస్త్రీని బలాత్కారంగా పొందినట్లయితే నీ శిరస్సు నూరు ముక్కలుగా బ్రద్దలవుతుంది; సందేహం లేదు." అని రావణుని శపించాడు.
ఇదీ అసలు విషయం. అందువల్ల సీతను అపహరించేటప్పుడు కేవలం ముట్టుకొని ఊరుకొన్నాడు కాబట్టి ఆ క్షణం రావణునికి ఏమీ కాలేదు. కానీ ఆ పాపం తర్వాత పండింది.
మంగళం మహత్