1, జూన్ 2013, శనివారం

రామసుందరం - ఆఱవసర్గం




సుందరకాండ - షష్ఠస్సర్గము
రావణాదుల భవనాల్లో ఆంజనేయుడు సీతను అన్వేషించుట

స నికామం విమానేషు
విషణ్ణః కామరూపధృక్ |
విచచార పునర్లంకాం
లాఘవేన సమన్వితః || 1
హనుమంతుడు,
రావణుని గృహాల్లో ఎక్కడా సీత జాడ కానక, ఎంతో విచారించాడు.
మరల జాగరూకుడై, లాఘవంతో లంకంతా వెదకడం మొదలుపెట్టాడు.

ఆససాదాథ లక్ష్మీవాన్
రాక్షసేంద్రనివేశనమ్ |
ప్రాకారేణార్కవర్ణేన
భాస్వరేణాభిసంవృతమ్ || 2
సూర్యకాంతితో ప్రకాశిస్తున్న
ప్రాకారం కల
రావణుని ప్రాసాదాన్ని
సమీపించాడు.

రక్షితం రాక్షసైర్ఘోరైః
సింహైరివ మహద్వనమ్ |
సమీక్షమాణో భవనం
చకాశే కపికుంజరః || 3
సింహరక్షితవనంలా,
భయంకరరాక్షసుల కాపలాలో ఉన్న
ఆ భవనాన్ని చూచి,
ఆశ్చర్యపడ్డాడు.

రూప్యకోపహితైశ్చిత్రైః
తోరణైర్హేమభూషితైః |
విచిత్రాభిశ్చ కక్ష్యాభిః
ద్వారైశ్చ రుచిరైర్వృతమ్ || 4

దానికి వెండిబంగారాలతో నిర్మించిన
తోరణాలు, చిత్రవిచిత్ర అంతస్తులు,
అందమైన ద్వారాలు ఉన్నాయి.
గజాస్థితైర్మహామాత్రైః
శూరైశ్చ విగతశ్రమైః |
ఉపస్థితమసంహార్యైః
హయైస్స్యందనయాయిభిః || 5
ఆ భవనసమీపంలో
మదపుటేనుగులపై శూరులున్నారు.
అశ్వారూఢులు, రథారూఢులు సర్వసన్నద్ధులై ఉన్నారు.

సింహవ్యాఘ్రతనుత్రాణైః
దాంతకాంచనరాజతైః |
ఘోషవద్భిర్విచిత్రైశ్చ
సదా విచరితం రథైః || 6
దంతాలు, వెండి, బంగారాలతో నిర్మింపబడిన రథాలు
అటూ ఇటూ తిరుగుతున్నాయి.
వాటిలో సింహవ్యాఘ్రచర్మాలతో చేసిన
కవచాలున్నాయి.

బహురత్నసమాకీర్ణం
పరార్థ్యాసనభాజనమ్ |
మహారథసమావాసం
మహారథమహాస్వనమ్ || 7
రత్నాలంకృతమైన ఆ భవనంలో
ఆసనాలు, పాత్రలు ఉన్నాయి.
మహారథులున్నారు.
మహారథాలు చేస్తున్న ధ్వనులున్నాయి.

దృశ్యైశ్చ పరమోదారైః
తైస్తైశ్చ మృగపక్షిభిః |
వివిధైర్బహుసాహస్రైః
పరిపూర్ణం సమంతతః || 8

వేలసంఖ్యలో
అందమైన
జింకలు, పక్షులు ఉన్నాయి.
వినీతైరంతపాలైశ్చ
రక్షోభిశ్చ సురక్షితమ్ |
ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః
పరిపూర్ణం సమంతతః || 9

ఆ భవనం,
సుశిక్షితులతో రక్షింపబడుతోంది.
వరస్త్రీలతో పరిపూర్ణమై ఉంది.
ముదితప్రమదారత్నం
రాక్షసేంద్రనివేశనమ్ |
వరాభరణసంహ్రాదైః
సముద్రస్వననిస్స్వనమ్ || 10
రావణనివాసంలో వనితలు
ఆనందంలో ఓలలాడుతున్నారు.
వారి ఆభరణాల మంజుల రవాలు
సముద్రపుటలలధ్వనుల్లా
మనోజ్ఞంగా ఉన్నాయి.

తద్రాజగుణసంపన్నం
ముఖ్యైశ్చాగరుచందనైః
మహాజనై స్సమాకీర్ణం
సింహైరివ మహద్వనమ్ || 11
ఆ భవనం,
ఛత్రాచామరాది రాజచిహ్నాలతో,
అగరుచందనాదుల పరిమళాలతో
అలరారుతోంది.
బలిష్ఠులతో సింహవనంలా ఉంది.

భేరీమృదంగాభిరుతం
శంఖఘోషనినాదితమ్ |
నిత్యార్చితం పర్వహుతం
పూజితం రాక్షసైస్సదా || 12
ఆ భవనంలో భేరీమృదంగధ్వనులు, శంఖనాదాలు మారుమ్రోగుతున్నాయి.
రాక్షసులతో సర్వపర్వకాలాల్లో
అక్కడ హోమం చేయబడుతోంది.
(అందఱికీ సుఖకరమైంది)
పూజింపబడుతోంది.
(కావలి ఉండటం వల్ల దుష్ప్రవేశమైంది)

సముద్రమివ గంభీరం
సముద్రమివ నిస్స్వనమ్ |
మహాత్మనో మహద్వేశ్మ
మహారత్నపరిచ్ఛదమ్ || 13

ఆ భవనం సముద్రంలా గంభీరమైనది.
(రావణభయంతో) నిశ్శబ్దమైనది.
దాని పైకప్పును గొప్పరత్నాలతో చేశారు.

మహారత్నసమాకీర్ణం
దదర్శ స మహాకపిః |
విరాజమానం వపుషా
గజాశ్వరథసంకులమ్ || 14
భవనం నిండా రత్నాలే.
అటువంటి రావణుని గృహాన్ని
ఆంజనేయుడు చూశాడు.
గజాశ్వరథాలు, మధురాకృతి గల

లంకాభరణమిత్యేవ
సో౭మన్యత మహాకపిః |
చచార హనుమాంస్తత్ర
రావణస్య సమీపతః || 15

ఆ భవనం, లంకకే ఆభరణమనుకొన్నాడు.
దాని సమీపంలో సంచరించాడు.
గృహాద్గృహం రాక్షసానామ్
ఉద్యానాని చ వానరః |
వీక్షమాణో హ్యసంత్రస్తః
ప్రాసాదాంశ్చ చచార సః || 16

రాక్షసగృహాలను, ప్రాసాదాలను,
ఉద్యానవనాలను క్రమక్రమంగా
వీక్షిస్తూ, నిర్భయంగా సంచరించాడు.
అవప్లుత్య మహావేగః
ప్రహస్తస్య నివేశనమ్ |
తతో౭న్యత్ పుప్లువే వేశ్మ
మహాపార్శ్వస్య వీర్యవాన్ || 17
ఆయన అతివేగంతో,
ప్రహస్తుని ఇంటికి,
అక్కడినుండి
మహాపార్శ్వుని ఇంటికి వెళ్లాడు.

అథ మేఘప్రతీకాశం
కుంభకర్ణనివేశనమ్ |
విభీషణస్య చ తదా
పుప్లువే స మహాకపిః || 18

మేఘంలాంటి కుంభకర్ణుని ఇంటికి,
విభీషణుని ఇంటికి వెళ్లాడు.
మహోదరస్య చ గృహం
విరూపాక్షస్య చైవ హి |
విద్యుజ్జిహ్వస్య భవనం
విద్యున్మాలేస్తథైవ చ || 19
తర్వాత ఆయన, మహోదరుడు,
విరూపాక్షుడు,
విద్యుజ్జిహ్వుడు,
విద్యున్మాలుడు

వజ్రదంష్ట్రస్య చ తథా
పుప్లువే స మహాకపిః |
శుకస్య చ మహాతేజాః
సారణస్య చ ధీమతః || 20

వజ్రదంష్ట్రుడు,
శుకుడు,
సారణుడు - వీరిండ్లకు వెళ్లాడు.
తథా చేంద్రజితో వేశ్మ
జగామ హరియూథపః |
జంబుమాలేస్సుమాలేశ్చ
జగామ హరిసత్తమః || 21

ఇంద్రజిత్తు,
జంబుమాలి,
సుమాలి ఇండ్లకు వెళ్లాడు.
రశ్మికేతోశ్చ భవనం
సూర్యశత్రోస్తథైవ చ |
వజ్రకాయస్య చ తథా
పుప్లువే స మహాకపిః || 22

రశ్మికేతువు,
సూర్యశత్రువు,
వజ్రకాయుడు,
ధూమ్రాక్షస్య చ సంపాతే:
భవనం మారుతాత్మజ: |
విద్యుద్రూపస్య భీమస్య
ఘనస్య విఘనస్య చ || 23

ధూమ్రాక్షుడు, సంపాతి,
విద్యుద్రూపుడు, భీముడు,
ఘనుడు, విఘనుడు,
శుకనాసస్య వక్రస్య
శఠస్య వికటస్య చ |
హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య
రోమశస్య చ రక్షస: || 24
శుకనాసుడు, వక్రుడు,
శఠుడు, వికటుడు,
హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు
రోమశుడు,

యుద్ధోన్మత్తస్య మత్తస్య
ధ్వజగ్రీవస్య నాదిన: |
విద్యుజ్జిహ్వేంద్రజిహ్వానాం
తథా హస్తిముఖస్య చ || 25

యుద్ధోన్మత్తుడు, మత్తుడు,
ధ్వజగ్రీవుడు, నాది,
విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు,
హస్తిముఖుడు
కరాళస్య పిశాచస్య
శోణితాక్షస్య చైవ హి |
క్రమమాణ: క్రమేణైవ
హనుమాన్ మారుతాత్మజ: || 26
కరాళుడు, పిశాచుడు,
శోణితాక్షుడు మొదలైన రాక్షసుల ఇండ్లకు వరుసగా వెళ్లి,
శోధించాడు.

తేషు తేషు మహార్హేషు
భవనేషు మహాయశా: |
తేషామ్ ఋద్ధిమతామ్ ఋద్ధిం
దదర్శ స మహాకపి: || 27

ఆ యా గృహాల్లో సంచరిస్తూ,
వారి సంపదలను వీక్షించాడు.

సర్వేషాం సమతిక్రమ్య
భవనాని సమంతత: |
ఆససాదాథ లక్ష్మీవాన్
రాక్షసేంద్రనివేశనమ్ || 28

అన్ని భవనాలను పూర్తిగా శోధించాక,
రావణుని ఇంటికి వెళ్లాడు.
రావణస్యోపశాయిన్యో
దదర్శ హరిసత్తమ: |
విచరన్ హరిశార్దూలో
రాక్షసీర్వికృతేక్షణా: || 29

రావణుని సమీపంలో శయనించిన,
వికృతచూపులుగల రాక్షసస్త్రీలను చూశాడు.
శూలముద్గరహస్తాశ్చ
శక్తితోమరధారిణీ: |
దదర్శ వివిధాన్ గుల్మాన్
తస్య రక్ష:పతేర్గృహే || 30
వారు శూలాలు, గుదియలు, శక్తి, తోమరాలు ధరించి ఉన్నారు.
ఇంకా అక్కడ నానావిధసేనావిభాగాలను కూడా చూశాడు.

రాక్షసాంశ్చ మహాకాయాన్
నానాప్రహరణోద్యతాన్ |
రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ
హరీంశ్చాపి మహాజవాన్ || 31
వివిధాయుధాల్ని ధరించిన మహాకాయుల్ని,
బంధించి ఉంచిన ఎఱ్ఱని, తెల్లని, గొప్ప గమనవేగం కల గుఱ్ఱాల్ని చూశాడు.

కులీనాన్ రూపసంపన్నాన్
గజాన్ పరగజారుజాన్ |
నిష్ఠితాన్ గజశిక్షాయామ్
ఐరావతసమాన్ యుధి || 32

ఉత్తమజాతి, చక్కని ఆకారం, శత్రుగజాలను పీడించే సామర్థ్యం,
యుద్ధవిద్యలలో సుశిక్షణ,
ఐరావతసామ్యం కలిగిఉండి,
నిహంతౄన్ పరసైన్యానాం
గృహే తస్మిన్ దదర్శ స: |
క్షరతశ్చ యథా మేఘాన్
స్రవతశ్చ యథా గిరీన్ || 33
శత్రుసైన్యాల్ని హతమార్చేవి,
వర్షిస్తున్న మేఘాల్లా
ప్రవాహం కలిగిన గిరుల్లా
మదజలం స్రవించేవి,

మేఘస్తనితనిర్ఘోషాన్
దుర్ధర్షాన్ సమరే పరై: |
సహస్రం వాహినీస్తత్ర
జాంబూనదపరిష్కృతా: || 34
మేఘగర్జనల్లా ఘీంకరించేవి,
ఎదిరించ వీలులేనివి అయిన
మదపుటేనుగుల్ని చూశాడు.
బంగారు అలంకారాలు

హేమజాలపరిచ్ఛన్నా:
తరుణాదిత్యసన్నిభా: |
దదర్శ రాక్షసేంద్రస్య
రావణస్య నివేశనే || 35

బంగారు ఆభరణాలు కలిగి,
మధ్యాహ్నసూర్యునిలాంటి
వేలసేనలను చూశాడు.

శిబికా వివిధాకారా:
స కపిర్మారుతాత్మజ: |
లతాగృహాణి చిత్రాణి
చిత్రశాలాగృహాణి చ || 36

వివిధపల్లకీలు,
చిత్రమైన పొదరిళ్లు,
చిత్రశాలలు,

క్రీడాగృహాణి చాన్యాని 
దారుపర్వతకానపి |
కామస్య గృహకం రమ్యం
దివాగృహకమేవ చ |
దదర్శ రాక్షసేంద్రస్య
రావణస్య నివేశనే || 37

క్రీడామందిరాలు,
దేవదారు వృక్షాలున్న క్రీడాపర్వతాలు, కామగృహాలు,
దివాగృహాలు చూశాడు.
(వెతికాడు)
స మందరగిరిప్రఖ్యం
మయూరస్థానసంకులమ్ || 38
ఆ రావణుని భవనం,
మందరగిరిలా బంగారుమయమై ఉంది.
క్రీడామయూరాలు,

ధ్వజయష్టిభిరాకీర్ణం
దదర్శ భవనోత్తమమ్ |
అనేకరత్నసంకీర్ణం
నిధిజాలం సమంతత: || 39

ధ్వజపతాకాలు,
రత్నాలు,
నిధులు కలది.
ధీరనిష్ఠితకర్మాంతం
గృహం భూతపతేరివ |
అర్చిర్భిశ్చాపి రత్నానాం
తేజసా రావణస్య చ || 40
సదాశివునికైలాసంలా
దృఢవ్రతుల తపఫలం అనదగ్గ
(కష్టపడి నిపుణులు తయారుచేశారనుట)
రత్నకాంతులతో, రావణుని తేజస్సుతో

విరరాజాథ తద్వేశ్మ
రశ్మిమానివ రశ్మిభి: |
జాంబూనదమయాన్యేవ
శయనాన్యాసనాని చ |
భాజనాని చ ముఖ్యాని
దదర్శ హరియూథప: || 41
వెలుగుతూ,
చండకిరణుడైన సూర్యునిలా ఉంది.
హనుమంతుడు చూసిన ఆ రావణభవనాన
తల్పాలు, ఆసనాలు, ముఖ్యపాత్రలు అన్నీ కాంచనమయమే.

మధ్వాసవకృతక్లేదం
మణిభాజనసంకులమ్ |
మనోరమమసంబాధం
కుబేరభవనం యథా || 42
ఆ భవనం తేనె మద్యాలతో తడిసింది.
మణులు పొదిగిన పాత్రలు కలది.
కుబేరప్రాసాదంలా విశాలంగా మనోహరంగా ఉంది.

నూపురాణాం చ ఘోషేణ
కాంచీనాం నినదేన చ |
మృదంగతలఘోషైశ్చ
ఘోషవద్భిర్వినాదితమ్ || 43

కాలి అందెల సవ్వడులు,
ఒడ్డాణాల రవళులు,
మృదంగనాదాలతో మార్మ్రోగుతోంది.
ప్రాసాదసంఘాతయుతం
స్త్రీరత్నశతసంకులమ్ |
సువ్యూఢకక్ష్యం హనుమాన్
ప్రవివేశ మహాగృహమ్ || 44
పెక్కు మేడలు,
పెక్కువేలమంది ఉత్తమస్త్రీలు,
మిక్కిలి విశాలమైన తొట్టికట్లు(లోగిళ్లు)తో
ఒప్పే, ఆ రావణుని మహాగృహంలోకి
హనుమంతుడు ప్రవేశించాడు.

           ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠస్సర్గః (6)


శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: