15, నవంబర్ 2011, మంగళవారం

తనయుడు

నన్నయ శతక నీతులు



వివిధ వేద తత్త్వవేది అయిన వేదవ్యాసుడు,

సంస్కృతభాషలో రచించిన "జయ" అనే ఇతిహాసాన్ని

ఆంధ్రమహాభారతం పేరున తెనిగించి, నన్నయ తెలుగున ఆదికవి అయ్యాడు.

భారతం ద్వారా అనేకానేక విషయాలను తెలుగువారికి అందించి, ధన్యుడయ్యాడు.

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం అని , అధ్యాత్మవిదులు వేదాంతం అని,

నీతివిచక్షణులు నీతిశాస్త్రం అని, కవివృషభులు మహా కావ్యం అని,

లాక్షణికులు ( కావ్యాలకు లక్షణాలను ఏర్పరచువారు ) సర్వలక్ష్యసంగ్రహం అని,

ఐతిహాసికులు ఇతిహాసం అని, పౌరాణికులు బహుపురాణసముచ్చయం అని,

భారతాన్ని కొనియాడడాన్ని బట్టి,

అందులోని విషయసముచ్చయమేమిటో సుబోధమవుతుంది.

ధర్మవిషయాలు, వేదాంతవిషయాలు, నీతులు ఇంకా ఎన్నింటినో

కథారూపంలో అనేక ఉదాహరణలతో భారతం వివరిస్తుంది.

అటువంటి భారతాన్ని తెనుగుచేయ సంకల్పించి, నన్నయ మొదట భారత రచనలో

తాను, కొన్ని కవితాలక్షణాలను పాటిస్తానని తెలియజేశాడు.

ప్రసన్నకథాకలి(వి)తార్థయుక్తి అనే ఒక కవితాలక్షణంతో కవీంద్రుల్ని ,

అక్షరరమ్యత అనే ఇంకో కవితాలక్షణంతో కవీంద్రులు కాని ఇతరుల్ని అలరింపజేస్తానంటూ,

తనను తాను నానారుచిరార్థసూక్తినిధిగా సంభావించుకొన్నాడు.

నానారుచిరార్థసూక్తినిధి అంటే అనేకములైన రుచిరములైన ప్రయోజనం కలిగిన సూక్తులకు నిధి.

సూక్తి అంటే సుభాషితం లేక నీతి.

నన్నయభారతాన్ని పరిశీలిస్తే అడుగడుగునా ఎన్నో నీతులు కనిపించి,

నిజంగానే నన్నయ సూక్తినిధి అనిపిస్తుంది.

లౌకికనీతులు, రాజనీతులు, ఆధ్యాత్మిక ప్రబోధకాలు, లోకజ్ఞతాసూచకాలు

ఇలా ఎన్నో రీతుల నీతులు జీడిపప్పుల్లా నన్నయభారతం అనే తీపివంటకంలో

వెదజల్లబడి, రుచి కలిగిస్తాయి.

వాటిని ఒంటబట్టించుకోవడమే మనం చేయవలసింది.

సూక్తినిధి నన్నయే తెలుగున ఆదికవి అయి ఎన్నో నీతుల్ని రచించాడు కాన

తెలుగు నీతి శతక కర్తలకు కూడా ఆయన మార్గదర్శి అయ్యాడనవచ్చు.

నన్నయ నీతిపద్యాలకు సుమతి వేమనశతకాదిపద్యాలు పూరణగాను, సమర్థకంగానూ,

అనుసరణగానూ ఉన్నాయని తోస్తుంది.

ఉదాహరణకు :


తనయుండు తల్లిదండ్రులు

పనిచిన పని సేయడేని, పలుకెడలో జే

కొనడేని, వాడు తనయుం

డనబడునే ? పితృధనమున కర్హుండగునే ?
(ఆదిపర్వం-తృతీయాశ్వాసం)


యయాతి చరిత్రలో మనకీ నీతి కనబడుతుంది.


తల్లిదండ్రులు ఆజ్ఞాపించిన పని చేయనివాడు, అసలు వారి మాటే లక్ష్యపెట్టనివాడు

కొడుకనబడతాడా ? పితృధనానికి అర్హుడవుతాడా ? ( పితృధనం అంటే ఆస్తి. )

అని ప్రశ్నలు వేసి, కాదనే జవాబు మనచేత చెప్పిస్తాడు నన్నయ.

నన్నయ మృదుస్వభావి. నీతుల్ని మెత్తగానే చెప్పాడు కానీ, పరుషంగా చెప్పలేదు.

"తనయుడు" అనే పదానికి , వంశమును విస్తరింపచేసేవాడు అని అర్థం.

తల్లిదండ్రుల మాట లెక్కచేయనివాని, వారిని గౌరవించనివాని వంశం వర్థిల్లదు. అని అన్యాపదేశం.

పితృధనం అంటే కేవలం ఆస్తే కాదు. వంశాభివృద్ధికూడా.

ఇక వేమన నన్నయంత మృదుస్వభావి కాదు. అవసరమైతే కర్కశంగా తిట్టగలడు.

తల్లిదండ్రుల యెడ కాఠిన్యం వహించేవాడు తనయుడనబడతాడా?

అనే నన్నయ ప్రశ్నకు కాదు "చెదపురుగు" అనబడతాడు అని సమాధానం చెప్పాడు.

అంతే కాదు పుట్టినా చచ్చినా ఒకటే అన్నాడు.



తల్లిదండ్రిమీద దయలేని పుత్త్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా

విశ్వదాభిరామ! వినుర వేమ!




చెదపురుగుకు పాడుచేయడం తప్ప బాగుచెయ్యడం చేతకాదు.

అమ్మానాన్నలమీద దయలేని కొడుకూ అంతే.

దయ అంటే రక్షించడం. రక్షించే స్వభావాన్నే దయ అంటారు.

కన్నవాళ్లు తమ పిల్లల్ని వారికి ఏమీ తెలియని వయసునుండి, అంటే కన్నక్షణంనుండి

వారి కాళ్లమీద వారు నిలబడేదాకా అనుక్షణం వెన్నంటి కాపాడతారు.

మరి అటువంటి తల్లిదండ్రులను జ్ఞానం వచ్చిన కొడుకు ఎలా చూసుకోవాలి?

తిరిగి ఎంత దయ చూపించాలి?



ఇక్కడ పైన పేర్కొన్న యయాతి కథను పరిశీలిస్తే, దయకు అర్థం బోధపడుతుంది.

యయాతి అనే రాజు శాపవశాత్తు తనకు లభించిన ముసలితనాన్ని తీసుకోమని

తన అయిదుగురు కొడుకులను అడగ్గా,

చివరి కొడుకు పూరుడు మాత్రం అంగీకరిస్తాడు.

మిగిలినవాళ్లు నిర్దయగా ముసలితనాన్ని అనుభవించవలసిందే అంటారు.

సుఖాలన్నీ అనుభవించాక యయాతి తిరిగి పూరునికి యౌవనం తిరిగి ఇవ్వడమే కాక

రాజ్యాన్ని కూడా ఇచ్చి, రాజును చేస్తాడు.

అప్పుడు ప్రజలు, పెద్దకొడుకును కాక చిన్నవాడిని రాజును చేయడం తగునా? అంటే,

పెద్దవాడు నామీద దయలేకుండా దుర్మదుడయ్యాడు.

నా వచనాన్ని ధిక్కరించాడు అంటూ పై నీతి చెప్తాడు.


కాబట్టి, దయ చూపించినవాడే తనయుడు.

దయ చూపించని కొడుకు అన్ని విధాల భ్రష్టుడవుతాడు.

ఇదీ ఇద్దరి కవుల తాత్పర్యం.



ఈ విధంగా నన్నయ నీతులకు శతకనీతులకు పోలిక చూడవచ్చు.

మరో నీతిపద్యంతో మరోసారి కలుద్దాం.



శుభం భూయాత్

6 కామెంట్‌లు:

Truely చెప్పారు...

మంచి టపా రాసారు . చాల బాగుంది

అజ్ఞాత చెప్పారు...

బాగుంది కాని, యయాతి విషయంలో అది స్వార్థంగా, అన్యాయంగా వుందేమో అనిపిస్తోందండి. తన కళ్ళముందే తన కుమారులు వృద్ధులయిపోవాలని కోరుకునే తండ్రి ఓ తండ్రేనా? అని వేమన తిట్టేవాడేమో అనిపిస్తోంది కూడా.

నాగస్వరం చెప్పారు...

Truely గారూ! కృతజ్ఞతలండి.

SNKR గారూ! కామానికి అంత శక్తి ఉందండి. దాని ముందు తన స్వార్థం
తప్ప నెనరూ న్యాయం అనిపించదు. కనిపించదు. యయాతి కథే అందుకు
ఉదాహరణ. అయితే యయాతిలో ధర్మచింతన ఉంది కాబట్టే కొంతకాలానికైనా సుఖోపభోగాలపట్ల విముఖత చెంది, మళ్ళీ తన కొడుకు యౌవనాన్ని తిరిగి ఇచ్చేశాడు.
భారతంలో పాత్రలు అనేక రకాల మానవస్వభావాలను మనకు తెలియజేస్తాయి. భారతం ఒక కథ కాదు. సజీవసంఘచిత్రణ.
ఈ దృష్టితో అర్థం చేసుకోవాలి.

కృతజ్ఞతలతో...

అజ్ఞాత చెప్పారు...

/భారతంలో పాత్రలు అనేక రకాల మానవస్వభావాలను మనకు తెలియజేస్తాయి. భారతం ఒక కథ కాదు. సజీవసంఘచిత్రణ.
ఈ దృష్టితో అర్థం చేసుకోవాలి./

బాగా చెప్పారు, జరిగిన కథ. భారతం ఓ గొప్ప కథేకాదు, రాజనీతి, కుటిలనీతి, ధర్మము, వైరాగ్యము, భోగము... ఇలా ఎన్నెన్నో కలబోసిన జ్ఞానచంద్రిక అనడంలో సందేహం లేదు.

అజ్ఞాత చెప్పారు...

*తల్లిదండ్రుల మాట లెక్కచేయనివాని, వారిని గౌరవించనివాని వంశం వర్థిల్లదు. *
నాగస్వరం గారు,
మన పూర్వీకులు ఒక మోతాదును మించి వంశానికి ప్రాముఖ్యత నిచ్చారనిపిస్తుంది. మీరు రాసిన సూక్తులన్ని తనయుడు (మగవారికి )సంబందించినవే.మరి కూతురుకి ఎమీ బాధ్యత ఉంది? ఈ రోజులలో వారికి ఆస్థి లో సమాన హక్కులు ఉన్నాయి కదా! మారిన పరిస్థితులలో వారేమి బాధ్యతలు తీసుకొంట్టున్నారు. ఇకనైనా కొడుకు నెట్టిన బాధ్యతలను రుద్దే ప్రయత్నం, బ్రయిన్ వాష్ ఆపాలి. తల్లిదండ్ర్లను అంతో ఇంతో అసంతృప్తికి గురిచేయని కొడుకు, తనకు తానుగా జీవితం లో ఎమీ నేర్చుకోలేదని,స్వంత అభిప్రాయలు లేని వ్యక్తి. నాయకత్వ లక్షణాలు శూన్యం. అతని వలన సంఘానికి పెద్ద ఉపయోగం లేదు.

నాగస్వరం చెప్పారు...

Rama గారూ!

మీ ఆవేదన అర్థం అయింది.

పూర్వాచార సంప్రదాయాల ప్రకారం ఆడబిడ్డ "ఆడ"బిడ్డే కాని ఈడబిడ్డ కాదు.
వివాహానంతరం ఆమె ఇంటిపేరు మారుతుంది. ఈ వ్యవస్థ నన్నయ భారతం నుండి (ఇంతకు ముందటి సంగతి వద్దు. ఇదే ప్రమాణం.) మన భారతదేశంలో
ఉంది. ఇది మారి కూతురికి కూడా తండ్రి వంశాభివృద్ధిలో బాధ్యత వచ్చినప్పుడు
కొడుకు నెత్తిన బాధ్యతలను రుద్డే ప్రయత్నం ,బ్రయిన్ వాష్ మానేయవచ్చు.

తల్లిదండ్రులను అసంతృప్తికి గురిచేయని కొడుకు సంఘానికి పనికిరాడని
బాగా నిర్వచించారు.
అయితే తాను తన తల్లిదండ్రులకు కల్గించిన అసంతృప్తిని తన కొడుకు తనకు
కల్గించిననాడు దాన్ని తట్టుకోగలిగితే మీరే రైటు.