19, అక్టోబర్ 2026, సోమవారం

తెలుగులో సంస్కృత సంధులు చెప్పేటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించాలా ?

 

ప్రశ్న : సంధులలో సంస్కృత మర్యాదలు పాటించాలి అనడానికి ఏదైనా ప్రయోజనం, కారణం ఉందా? తెలుగులో మనం ఉపయోగించే పదాలను అలానే ఉపయోగించి చేస్తే కూడా సంస్కృత సంధులు వస్తున్నాయి. అలాంటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించండి అని చెప్పి అభ్యాసకులను తికమక పెట్టడం ఎందుకు? సంస్కృతంలో దీర్ఘాంతాలుగా ఉపయోగిస్తారు కాబట్టి అలా వాడుతారు. మనం మన వ్యవహారంలో ఆ విధంగా ఉపయోగించడం లేదు కదా! మరి ఎందుకు సంస్కృత మర్యాదలు పాటించాలో తెలిజేయగలరు. తెలుగు భాషలో సంస్కృత పదాలున్నా తెలుగు భాషలో ఉన్న పదాలకు వ్యాకరణం చెప్పుకుంటున్నాం. సంస్కృత పదాలకు తెలుగు ప్రత్యయాలు చేర్చుకొని తెలుగు భాషలో ఉపయోగించుకుంటున్నాము అటువంటప్పుడు అవి తెలుగు పదాలే. ఆ పదాలకు సంధులు చేయడం వదిలేసి మనం ఉపయోగించని పదాలను ఉపయోగించి సంధులు చేయండి అది సంస్కృత మర్యాద అని అనడం ఎంతవరకు సమంజసం. దానివల్ల కలిగిన ఉపయోగం ఏమి? మన తెలుగులో ఉపయోగించే పదాలనే ఉపయోగించి సంధులు చేస్తే వచ్చే నష్టం ఏమి? ఏదైనా సంధికార్యాలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా? లేవు కదా. అన్నీ సంధులలో చెప్పినట్లే చక్కగా జరుగుతున్నాయ్. అలాంటప్పుడు ఈ విధంగా సంస్కృత మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదు. ఒక వేళ పాటించాలనుకుంటే దానికి ఏమైనా ప్రయోజనం ఉండాలి.  ఆ ప్రయోజనం ఏంటి?

నా(గ) స్వ(రం) వ్యాఖ్య:

 తెలుగు ఆదాన భాష. సంస్కృతం ప్రదాన భాష. 

అందువల్ల ఎన్నో సంస్కృతపదాలు తెలుగులో చేరాయి. ముఖ్యంగా నన్నయ దయవల్ల. 

అందువల్ల తెలుగు కలగాపులగమైంది. 

మరి ఆ తరువాత తెలుగుకు వ్యాకరణాలు వచ్చాయి. బాలవ్యాకరణం ముఖ్యమైనది. 

అభ్యాసకులు/విద్యార్థులు  వ్యాకరణం నేర్చుకొనేటప్పుడు రెండు భాషలలోని సంధులను అధ్యయనం చేయాలి తప్పదు.

సంస్కృత పదాలు కొన్ని దీర్ఘాంతాలుగా ఉంటాయి. అవి తెలుగులోకి వచ్చేసరికి హ్రస్వాంతాలవుతాయి.

"నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు" సూత్రం చేత 

విద్యా – విద్య అవుతుంది. 

అప్పుడు విద్యాలయము అనే పదాన్ని విడదీసినప్పుడు విద్యా + ఆలయము అని విడదీయాలి నిజానికి. 

కానీ మీరు విద్యా తెలుగులో విద్య అయినప్పుడు విద్య అని చెప్పవచ్చుగా  సరిపోయిందిగా అంటారు . నిజమే సరిపోవచ్చు .

కానీ రాకా అంటే తెలుసుగా. 

దానికి ఈశుడు కలిపితే దాన్ని మీరు చెప్పిన ప్రకారం తెలుగులో రాక + ఈశుడు అనాలి. 

అపుడు అర్థం ఏమైంది ?

అలాగే మహేశ్వరుడు ఎలా విడదీస్తారు?

మహ అందామా? గొప్ప అనే అర్థం రాదు మరి.

ఎల్లప్పుడూ ఆనందించువాడు అనే అర్థంలో సదానందుడు విడదీస్తే సద అనాలా? అర్థమే లేదు.

సదైక విడదీసినా సదా అనే అనాలి .

వధూపేతుడు విడదీస్తే వధూ అనే అనాలి. వధు అంటే ఆ తర్వాత విద్యార్థి వధు అని నిఘంటువులో వెదకితే దొరకదు.

చమూత్కర్షము – విడదీస్తే చమూ అనే అనాలి. చము అంటే అర్థం లేదు .

ఇది కాక అభ్యాసకుల్లో ఔత్సాహికులు ఉంటే వారు నిఘంటువుల్లో వెదకితే పై పదాలకు అర్థాలు దొరకవు.

గంగోదకం విడదీసి చెప్పేటప్పుడు గంగా అనకుండా గంగ + ఉదకం అన్నామనుకోండి సరిపోతుంది.

కానీ  ఆ తర్వాత ఆ ఔత్సాహికునకు గంగానది పదం కనబడినప్పుడు గంగనది  అవ్వలేదేమి  అంటే ...?

అపుడు బాబూ! అది సంస్కృతంలో ఆకారాంత శబ్దం అని చెప్పాలిగా!

సంస్కృత మర్యాదలు పాటించకపోతే సమాసాల్లోనూ తేడాలు వస్తాయిగా !

గౌరీశుడు, లక్ష్మీపతి, విద్యానిలయం ఇలా ఎన్నో హ్రస్వాలవుతాయి.   

సంస్కృత పదాలకు తెలుగు ప్రత్యయాలు చేర్చుకొని తెలుగు భాషలో ఉపయోగించుకుంటున్నాము అటువంటప్పుడు అవి తెలుగు పదాలే. అంటున్నారు మీరు. 

కాదు.

సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చాక అవి తత్సమాలనబడతాయి తప్ప తెలుగు కాదు. తత్సమాలకు సంధి లేదుగా.

చెప్పేవి సంస్కృత సంధులు. తత్సమ సంధులు కాదు. 

కాబట్టి సంస్కృత సంధులన్నపుడు సంస్కృత మర్యాదలు పాటించడం సబబే కదా !

అలాగే అహో , సదా , సర్వథా, అథవా మొదలైన పదాలు తత్సమాలు కావు. శుద్ధ సంస్కృతాలు. అలాగే  వాడాలి .

అదీ కాక సంధిలో పదాలు విడదీసినప్పుడు వాటి సహజ శబ్దస్వరూపాలు చెప్పడమే సమంజసం అని కోరాడ లాంటి భాషావ్యాకరణవేత్తలు అంటారు. ఎందుకంటే పదం మూలం తెలియకపోతే వేరే చోట అది వర్తించక గందరగోళం ఏర్పడుతుంది .

అభ్యాసకులలో ఎవరు కవులవుతారో తెలియదు. వారికి పదస్వరూపం ఇది అని చెప్పాలి. తప్పదు.

ఇంగ్లీషు నేర్పేటప్పుడు దాని మర్యాదను పాటిస్తూ నేర్పుతారుగా

doubt పదం చెప్పేటప్పుడు (డౌట్ లేకుండా) b సైలెంట్ అని నేర్పుతారు కదా!

would ని వుల్డ్ అనకు అంటారుగా!

పరాయి భాషనే మర్యాద పాటిస్తూ జాగ్రత్తగా నేర్పేటప్పుడు మన దేవభాషను విజ్ఞానప్రదాత అయిన భాషను దాని మర్యాదను పాటిస్తూ చెప్పడంలో కష్టముందా? తికమక ఉందా? చెప్పండి.  

 దోషాలు చెప్తే సరిదిద్దుకొంటాను. 

 

మంగళం మహత్  

     

    

కామెంట్‌లు లేవు:

తెలుగులో సంస్కృత సంధులు చెప్పేటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించాలా ?

  ప్రశ్న : సంధులలో సంస్కృత మర్యాదలు పాటించాలి అనడానికి ఏదైనా ప్రయోజనం, కారణం ఉందా ? తెలుగులో మనం ఉపయోగించే పదాలను అలానే ఉపయోగి...