19, అక్టోబర్ 2026, సోమవారం

తెలుగులో సంస్కృత సంధులు చెప్పేటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించాలా ?

 ప్రశ్న : సంధులలో సంస్కృత మర్యాదలు పాటించాలి అనడానికి ఏదైనా ప్రయోజనం, కారణం ఉందా? తెలుగులో మనం ఉపయోగించే పదాలను అలానే ఉపయోగించి చేస్తే కూడా సంస్కృత సంధులు వస్తున్నాయి. అలాంటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించండి అని చెప్పి అభ్యాసకులను తికమక పెట్టడం ఎందుకు? సంస్కృతంలో దీర్ఘాంతాలుగా ఉపయోగిస్తారు కాబట్టి అలా వాడుతారు. మనం మన వ్యవహారంలో ఆ విధంగా ఉపయోగించడం లేదు కదా! మరి ఎందుకు సంస్కృత మర్యాదలు పాటించాలో తెలిజేయగలరు. తెలుగు భాషలో సంస్కృత పదాలున్నా తెలుగు భాషలో ఉన్న పదాలకు వ్యాకరణం చెప్పుకుంటున్నాం. సంస్కృత పదాలకు తెలుగు ప్రత్యయాలు చేర్చుకొని తెలుగు భాషలో ఉపయోగించుకుంటున్నాము అటువంటప్పుడు అవి తెలుగు పదాలే. ఆ పదాలకు సంధులు చేయడం వదిలేసి మనం ఉపయోగించని పదాలను ఉపయోగించి సంధులు చేయండి అది సంస్కృత మర్యాద అని అనడం ఎంతవరకు సమంజసం. దానివల్ల కలిగిన ఉపయోగం ఏమి? మన తెలుగులో ఉపయోగించే పదాలనే ఉపయోగించి సంధులు చేస్తే వచ్చే నష్టం ఏమి? ఏదైనా సంధికార్యాలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా? లేవు కదా. అన్నీ సంధులలో చెప్పినట్లే చక్కగా జరుగుతున్నాయ్. అలాంటప్పుడు ఈ విధంగా సంస్కృత మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదు. ఒక వేళ పాటించాలనుకుంటే దానికి ఏమైనా ప్రయోజనం ఉండాలి.  ఆ ప్రయోజనం ఏంటి?

నా(గ) స్వ(రం) వ్యాఖ్య:

 తెలుగు ఆదాన భాష. సంస్కృతం ప్రదాన భాష. 

అందువల్ల ఎన్నో సంస్కృతపదాలు తెలుగులో చేరాయి. ముఖ్యంగా నన్నయ దయవల్ల. 

అందువల్ల తెలుగు కలగాపులగమైంది. 

మరి ఆ తరువాత తెలుగుకు వ్యాకరణాలు వచ్చాయి. బాలవ్యాకరణం ముఖ్యమైనది. 

అభ్యాసకులు/విద్యార్థులు  వ్యాకరణం నేర్చుకొనేటప్పుడు రెండు భాషలలోని సంధులను అధ్యయనం చేయాలి తప్పదు.

సంస్కృత పదాలు కొన్ని దీర్ఘాంతాలుగా ఉంటాయి. అవి తెలుగులోకి వచ్చేసరికి హ్రస్వాంతాలవుతాయి.

"నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు" సూత్రం చేత 

విద్యా – విద్య అవుతుంది. 

అప్పుడు విద్యాలయము అనే పదాన్ని విడదీసినప్పుడు విద్యా + ఆలయము అని విడదీయాలి నిజానికి. 

కానీ మీరు విద్యా తెలుగులో విద్య అయినప్పుడు విద్య అని చెప్పవచ్చుగా  సరిపోయిందిగా అంటారు . నిజమే సరిపోవచ్చు.

కానీ రాకా అంటే తెలుసుగా. 

దానికి ఈశుడు కలిపితే దాన్ని మీరు చెప్పిన ప్రకారం తెలుగులో రాక + ఈశుడు అనాలి. 

అపుడు అర్థం ఏమైంది ?

రాకా అంటే వచ్చే అర్థం రాకకు వస్తుందా 

అలాగే మహేశ్వరుడు ఎలా విడదీస్తారు?

మహ అందామా? గొప్ప అనే అర్థం రాదు మరి. (నిజానికి డిగ్రీ విద్యార్థులయినా మహ అనే విడదీస్తారు. మహా అనరు.) 

ఎల్లప్పుడూ ఆనందించువాడు అనే అర్థంలో సదానందుడు విడదీస్తే సద అనాలా? అర్థమే లేదు.

సదైక విడదీసినా సదా అనే అనాలి .

వధూపేతుడు విడదీస్తే వధూ అనే అనాలి. వధు అంటే ఆ తర్వాత విద్యార్థి వధు అని నిఘంటువులో వెదకితే దొరకదు.

చమూత్కర్షము – విడదీస్తే చమూ అనే అనాలి. చము అంటే అర్థం లేదు .

ఇది కాక అభ్యాసకుల్లో ఔత్సాహికులు ఉంటే వారు నిఘంటువుల్లో వెదకితే పై పదాలకు అర్థాలు దొరకవు.

గంగోదకం విడదీసి చెప్పేటప్పుడు గంగా అనకుండా గంగ + ఉదకం అన్నామనుకోండి సరిపోతుంది.

కానీ  ఆ తర్వాత ఆ ఔత్సాహికునకు గంగానది పదం కనబడినప్పుడు గంగనది  అవ్వలేదేమి  అంటే ...?

అపుడు బాబూ! అది సంస్కృతంలో ఆకారాంత శబ్దం అని చెప్పాలిగా!

సంస్కృత మర్యాదలు పాటించకపోతే సమాసాల్లోనూ తేడాలు వస్తాయిగా !

గౌరీశుడు, లక్ష్మీపతి, విద్యానిలయం ఇలా ఎన్నో హ్రస్వాలవుతాయి.

సంధులలో ఏవో కొన్ని పదాలే కదా మీరు చెప్పింది అవి ఎక్కువ రావు వ్యవహారంలో అంటారా?  

అయితే ఉదాహరణకు అ ఇ ఉ ఋ లకు అవే వర్ణాలు పరమైతే .. అని సవర్ణదీర్ఘసంధి సూత్రం చెప్పేటప్పుడు 

అకారం అ ఆ లను బోధిస్తుంది అని చెప్పాలి కదా!  అలాగే ఇ ఉ ఋ లకు కూడ.  

మరి అప్పుడు "దీర్ఘాలకు ఉదాహరణలేవీ" అని విద్యార్థి అడిగితే ఏం చెప్పాలి?

"అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశ్వతోముఖమ్" అన్నట్లు సూత్రం అన్నీ చోట్ల ఒకేలా పని చేయాలి కదా!

అసలు అలా చెప్పకపోతేనే తికమక. 

"సంస్కృత పదాలకు తెలుగు ప్రత్యయాలు చేర్చుకొని తెలుగు భాషలో ఉపయోగించుకుంటున్నాము అటువంటప్పుడు అవి తెలుగు పదాలే'. అంటున్నారు మీరు. 

కాదు.

సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చాక అవి తత్సమాలనబడతాయి తప్ప తెలుగు కాదు. తత్సమాలకు సంధి లేదుగా.

చెప్పేవి సంస్కృత సంధులు. తత్సమ సంధులు కాదు. 

కాబట్టి సంస్కృత సంధులన్నపుడు సంస్కృత మర్యాదలు పాటించడం సబబే కదా !

అలాగే అహో , సదా , సర్వథా, అథవా మొదలైన పదాలు తత్సమాలు కావు. శుద్ధ సంస్కృతాలు. అలాగే  వాడాలి .

అదీ కాక సంధిలో పదాలు విడదీసినప్పుడు వాటి సహజ శబ్దస్వరూపాలు చెప్పడమే సమంజసం అని కోరాడ లాంటి భాషావ్యాకరణవేత్తలు అంటారు. ఎందుకంటే పదం మూలం తెలియకపోతే వేరే చోట అది వర్తించక గందరగోళం ఏర్పడుతుంది .

అభ్యాసకులలో ఎవరు కవులవుతారో తెలియదు. వారికి పదస్వరూపం ఇది అని చెప్పాలి. తప్పదు. 

{ఇపుడు పద్యాలు వ్రాసేవారే తక్కువ. కొందరు ఇష్టమొచ్చినట్లు వ్రాస్తున్నారనుకోండి. పైగా దిద్దేవాళ్ళు, ఒప్పులు చెప్పేవారూ తగ్గిపోయారు. ఒకవేళ చెప్తే కోపాలు. నా ఇష్టం అంటున్నారు.}

ఇంగ్లీషు నేర్పేటప్పుడు దాని మర్యాదను పాటిస్తూ నేర్పుతారుగా, 

doubt పదం చెప్పేటప్పుడు (డౌట్ లేకుండా) b సైలెంట్ అని నేర్పుతారు కదా!

would ని వుల్డ్ అననివ్వరుగా!

పరాయి భాషనే మర్యాద పాటిస్తూ జాగ్రత్తగా నేర్పేటప్పుడు మన దేవభాషను, విజ్ఞానప్రదాత అయిన భాషను దాని మర్యాదను పాటిస్తూ చెప్పడంలో కష్టముందా? తికమక ఉందా? చెప్పండి.  

కాబట్టి తెలుగులో సంస్కృత సంధులు చెప్పేటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించాలి. అదే మర్యాద.

 

మంగళం మహత్  

     

    

12, సెప్టెంబర్ 2026, శనివారం

జాషువా కవిత్వంలో అంతరార్థం

సందేశం పాఠంలో పూప వయస్సులో తెలుగు వలసపోయింది అని కవి అనటంలో అంతరార్థం ఎవరైనా తెలుపగలరు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య 

             క్రీ.శ 16 వ శతాబ్దం తెలుగు కవిత్వానికి స్వర్ణయుగం. ఈ కాలంలో సంస్కృతం నుండి దిగుమతి చేయడానికి కవులకు ఏదీ మిగలలేదు. అందుకే స్వతంత్రకావ్యనిర్మాణం అవసరమైంది. ఈ ఆలోచనే ప్రబంధయుగానికి మారాకు వేసింది. ఈ కాలంలోని అభినవ భోజుడు కృష్ణ రాయలు విశేషంగా కవిపండితకళాకారులను ఆదరించాడు.


            విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత రాజాదరణ కోల్పోయిన తెలుగు కవులను అభినవకృష్ణరాయలైన రఘునాథుడు ఆదరించాడు. దాంతో  భువనవిజయం లాంటి విజయభవనంలో తెలుగు కవిత్వం కళకళలాడింది.


           మొదటినుండి అనువాద కవిత్వంతో పరిఢవిల్లిన తెలుగు కవిత ప్రబంధ
శిశువుగా  కొత్తరూపంతో  ప్రభవించింది. కాని  తక్కువ కాలమే లాలింపబడింది కాబట్టి ఇంకా పూపవయస్సే. 


            రఘునాథునికి తెలుగు అంటే ఇష్టమని ఆదరిస్తున్నాడని తెల్సి, కవులు తంజాపురికి తరలిపోయారని చెప్తూ జాషువా ఆ విధంగా చమత్కరించారు. 

ఇది నా అభిప్రాయం.

మంగళం మహత్ 




26, జనవరి 2025, ఆదివారం

సీతను తాకిన రావణుని తల వ్రక్కలు కాలేదు ఎందుకు

రామాయణం చదవకుండా సరి కాని సంగతులను విన్నవారు సందేహపడిన విషయమిది. 

స్త్రీని ఇష్టం లేకుండా తాకితే రావణుని తల వక్కలవుతుందని వేదవతి శాపమిచ్చింది కదా! మఱి సీతను అపహరించేటప్పుడు ఆమెను తాకిన రావణునికి ఏమీ కాలేదెందుకు?. 

ఇదీ సందేహం.

వేదవతి శాపం శుద్ధ అబద్ధం.

నా(గ)స్వ(ర)వ్యాఖ్య 

ఒకసారి రావణుడు హిమవత్పర్వత ప్రాంతారణ్యానికి వెళ్ళి అక్కడ సంచరిస్తూ, కుశధ్వజుని కుమార్తె వేదవతిని చూశాడు.

ఆమె ఒద్దంటూన్నా వినకుండా భార్యవు కమ్మంటూ ఆమె శిరోజాలను పట్టుకొన్నాడు.

అవమానభారంతో వేదవతి కోపించి, అగ్నిప్రవేశం చేస్తూ, రావణునితో

"శాపే త్వయి మయోత్సృష్టే 

తపసశ్చ వ్యయో భవేత్‌."

"నీకు శాపమిస్తే నా తపస్సు వ్యయమై పోతుంది." అంది. 

కాబట్టి ఏ శాపం ఇవ్వలేదని అర్థమైంది కదా!

ఇంతకీ రావణుని తల వ్రక్కలయ్యే శాపం ఇచ్చినది కుబేరుని కొడుకైన నలకూబరుడు. 

ఆ కథ ఏమిటంటే, ఇంకోసారి రావణుడు నలకూబరుని భార్య రంభను ఆమె అధర్మమిది వలదంటున్నా వినిపించుకోకుండా మానభంగం చేస్తాడు. అది తెలిసిన నలకూబరుడు 

"యదా హ్యకామాం కామార్తో 

ధర్షయిష్యతి యోషితమ్‌, 

మూర్దా తు సప్తధా తస్య 

శకలీభవితా తదా."

"ఈ రావణుడు కామం లేని స్త్రీని ఎవ్వరినైన అనుభవిస్తే, అప్పుడు ఈతని శిరస్సు ఏడు ముక్కలుగా బ్రద్దలవుతుంది." అని శపిస్తాడు.

అలాగే పుంజికస్థల అనే అప్సరసనూ రావణుడు చెఱుస్తాడు. ఆవిడ బ్రహ్మతో మొఱ పెట్టుకొంది. 

బ్రహ్మ కోపించి, 

"అద్యప్రభృతి యామన్యాం 

బలాన్నారీం గమిష్యసి, 

తదా తే శతధా మూర్ధా 

ఫలిష్యతి న సంశయః" 

"ఈనాడు మొదలు పరస్త్రీని బలాత్కారంగా పొందినట్లయితే నీ శిరస్సు నూరు ముక్కలుగా బ్రద్దలవుతుంది; సందేహం లేదు." అని రావణుని శపించాడు. 

ఇదీ అసలు విషయం. అందువల్ల సీతను అపహరించేటప్పుడు కేవలం ముట్టుకొని ఊరుకొన్నాడు కాబట్టి ఆ క్షణం రావణునికి ఏమీ కాలేదు. కానీ ఆ పాపం తర్వాత పండింది.


మంగళం మహత్

16, ఏప్రిల్ 2024, మంగళవారం

వేటూరి వ్యాఖ్యానం

సాగరసంగమం సినిమాలో
 
వాగర్థావివసంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే 
పార్వతీపరమేశ్వరౌ 

అనే కాళిదాస రఘువంశ శ్లోకాన్ని పాడిస్తూ,

పార్వతీపరమేశ్వరౌ అని కలిపి ఒకసారి
పార్వతీప రమేశ్వరౌ అని విడదీసి ఒకసారి 
పాడించామని 
పార్వతీపః అంటే శివుడని వేటూరి వారన్నారు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య :-

పార్వతీపః అంటే శివుడనే అర్థం ఎక్కడా లేదు. దీనికోసం అన్ని నిఘంటువులనూ తిరగవేయడం జరిగింది.

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పినది అనడంతో అంతటి పండితుడు ఇలా చెప్పి ఉంటారా అనే సందేహం వస్తోంది. నమ్మబుద్ధి కావడం లేదు.

రఘువంశానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథుడు
(ఈ మల్లినాథుడు విద్వత్సార్వభౌముడు. ఈయన వ్యాఖ్య వ్రాశాక పూర్వ వ్యాఖ్యలు మూలపడ్డాయి. అంత గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లినాథుని వల్లనే మహాపండితులకు కూడ కాళిదాసు అర్థమయ్యాడు.) 
పితరౌ అన్నదానికి వ్యాఖ్య వ్రాస్తూ 
"మాతా చ పితా చ పితరౌ" అని స్పష్టంగా వ్రాశారు తప్ప ఇద్దరు తండ్రులు అని పేర్కొనలేదు. 

పోని ఆయనకు తెలియదనుకొందాం. 

రఘువంశానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు వ్రాసిన మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ వేదం వేంకటరాయశాస్త్రి గారు కూడా ఇటువంటి విశేషార్థం ఉంది అని చెప్పలేదు.

"కవి కేవలం పార్వతి పరమేశ్వరులకు నమస్కారం అని అంటాడా...." అని వేటూరివారనడం ఆశ్చర్యంగా ఉంది.

ఈ శ్లోకంలో (నమస్కారమే కాక) పార్వతీపరమేశ్వరులను వాగర్థాలతో పోల్చడం ముఖ్యమైన అంశం. 

ఇలా పార్వతీపరమేశ్వరులను వాగర్థాలవలె కూడి ఉన్నారని పోల్చడమే అంతవఱకూ ఎవరికీ తట్టని గొప్ప విషయం. 

వాక్ తోడనే అర్థం స్ఫురించినట్లు పార్వతి తోడనే పరమేశ్వరుడు స్ఫురిస్తాడు అన్న విషయాన్ని కాళిదాసు హైలెట్ చేసి చెప్పాడు. 

పార్వతీపరమేశ్వరుల నిరతిశయాన్యోన్య ప్రేమాతిశయం తెలుపడం కోసం వారిని వాగర్థాలతో పోల్చాడు.

తాను రఘువంశ మహాకావ్యం వ్రాయబోతున్నాడు. పైగా వ్రాయగలనా లేదా అనే సందేహం ఒకటి చింతకు గురి చేస్తోంది. అలాగే "ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశాల"లో ఒకటి పాటిస్తూ, ప్రథమశ్లోకం వ్రాయాలనే సత్సంప్రదాయాన్ని పాటించాలి.

ఇక్కడే కాళిదాసు ప్రతిభ కనబడుతుంది. 
వారు తల్లిదండ్రులు. తాను పుత్త్రుడు. కావ్యరచన అనే తన ఈప్సితం నెరవేరాలి. అందుకు వారి ఆశీస్సులు కావాలి. అందుకు నమస్కారం తగినది. అందువల్ల ఆశీఃవస్తునిర్దేశాలకు పోకుండా నమస్కారాన్ని ఎంచుకొన్నాడు.
. 
బిడ్డ కోరికను అన్యోన్యవిమనస్కులైన తల్లిదండ్రులు తీరుస్తారా? అన్యోన్యరక్తులైన వారు తీరుస్తారా అంటే జవాబు స్పష్టమే కదా! అందుకే అర్థనారీశ్వరతత్త్వం ప్రకటితమయ్యేలా, వారిని విడదీయలేని వాగర్థాలతో పోల్చి, తన భక్తిప్రపత్తులను చాటుకొంటూ నమస్కారం చేశాడు.

వాయుపురాణసంహితావచనంలో
శబ్దజాలం పార్వతి, అర్థజాలం శివుడు అని శబ్దార్థస్వరూపాలుగా చెప్పబడితే, 
కాళిదాసు శబ్దార్థాలుగా కూడి ఉన్నట్లు చెప్పి, ఈ గొప్ప ఔపమ్యంచేత పార్వతీపరమేశ్వరుల నిరతిశయాన్యోన్య ప్రేమాతిశయాన్ని హృదయంగమంగా వర్ణించాడు.

పార్వతి అనగానే పరమేశ్వరుడు స్ఫురించినట్లు పరమేశ్వరుని స్మరించినంతనే విష్ణువు స్ఫురించడు. ఆలోచిస్తే తెలుస్తుంది.

ఇంకా వేటూరి వారు
"కవి ఇంకేమన్నా సంఘప్రయోజనాన్ని ఆశించి ఏమన్నా అని ఉండచ్చునా...." అన్నారు.

అంటే వారి దృష్టిలో శైవవైష్ణవమతకలహాలై ఉంటాయనుకోవచ్చు. అందువల్ల ఈ శ్లోకంతో శివకేశవులొకటే అని కాళిదాసు చాటి ఉంటాడని వారి ఊహ.

కాళిదాసు క్రీస్తుపూర్వం వాడు.
అప్పుడేమీ శివకేశవభేదాల గొడవలు లేవు. 
 
క్రీ.శ 12వ శతాబ్ది ప్రాంతం నాటికి వీరశైవం ఉద్భవించి, శైవవైష్ణవమతకల్లోలాలు రేగాయి. అందువల్ల అటువంటి సంఘప్రయోజనం కోసం అన్నది కూడ కాళిదాసు నాటికి అవసరం ఉన్నట్లు తోచదు.

కాబట్టి వాగర్థాలకు పార్వతీపరమేశ్వరులే సరైన అపూర్వమైన అద్భుతమైన ఉపమానం.

ఇవన్నీ పర్యాలోచించి చూస్తే వాగర్థాలకు ఔపమ్యం పార్వతీపరమేశ్వరులు మాత్రమే తప్ప శివవిష్ణువులు కాదని నా(గస్వరం)భావం. పండితులు తేల్చాలి.

మంగళం మహత్ 

తెలుగులో సంస్కృత సంధులు చెప్పేటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించాలా ?

  ప్రశ్న : సంధులలో సంస్కృత మర్యాదలు పాటించాలి అనడానికి ఏదైనా ప్రయోజనం, కారణం ఉందా ? తెలుగులో మనం ఉపయోగించే పదాలను అలానే ఉపయోగించ...